Marital Rape Supreme Court : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఫిబ్రవరి 15లోగా దీనిపై స్పందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 21న తదుపరి విచారణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
దిల్లీకి చెందిన ఖుష్బూ సైఫీ అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. కర్ణాటకు చెందిన మరో వ్యక్తి సుప్రీంను ఆశ్రయించాడు. దిల్లీకి చెందిన మహళ అంతకుముందు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం 2022 మే 11న వేర్వేరు తీర్పులను వెలువరించింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి.హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది.
ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక సంభోగం జరపడం నేరం కాదు. అయితే.. ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కొందరు సవాలు చేశారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్ శక్ధేర్ తీర్పు రాశారు. సెక్షన్ 375, 376(E) మినహాయిస్తే.. వైవాహిక అత్యాచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,19(1)(A), 21లను ఉల్లంఘించే అంశం అని పేర్కొన్నారు.