తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Margadarsi Case: మార్గదర్శి కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన.. పలువురు అధికారులకు నోటీసులు - సీఐడీ అదనపు డీజీ సంజయ్

Margadarsi Case Updates: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఉల్లంఘించిందంటూ మార్గదర్శి దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లలో.. సంబంధిత అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఎస్పీలు S.రాజశేఖర్‌రావు, CH.రవికుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.

Margadarsi Case
Margadarsi Case

By

Published : Jul 8, 2023, 9:33 AM IST

మార్గదర్శి కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన

Margadarsi Case Updates: కఠిన చర్యలు చేపట్టరాదంటూ మార్చి 21న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్‌ నోటీసు జారీ చేశారని, మార్గదర్శి ఆస్తుల జప్తునకు ఆదేశించిన ఏపీ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ Ch.శైలజ తరఫున వేర్వేరుగా ధిక్కరణ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.సురేందర్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది వాసిరెడ్డి విమల్‌ వర్మ వాదనలు వినిపించారు.

కఠిన చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ప్రతివాదులు ఎండీకి లుకౌట్‌ నోటీసులు జారీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వాదించారు. ఇంతలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపించబోగా... పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయలేదని, వ్యక్తిగత హోదాలో అధికారులను ప్రతివాదులుగా చేర్చామని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించకూడదని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి వకాలత్‌ తీసుకుని వాదనలు వినిపిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.

ఆ తర్వాత ఏపీ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపించారు. మార్గదర్శి కేసులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. మార్గదర్శి పిటిషన్లన్నింటిపై విచారణను ఈ నెల 20కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసిందని తెలిపారు.

లుకౌట్‌ నోటీసుల జారీ కఠిన చర్యే: దీనిపై మార్గదర్శి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పిటిషన్లపై విచారించి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసిందని, గతంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. కఠిన చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు ఉన్నా... మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారన్నారు. లుకౌట్‌ నోటీసుల జారీ.. కఠిన చర్యేనంటూ దిల్లీ హైకోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులకు ఇప్పటికిప్పుడు శిక్ష విధించాలని కోరడం లేదని, నోటీసులు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి... ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఎస్పీలు S.రాజశేఖర్‌రావు, CH.రవికుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details