Maratha Reservation Agitation :మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు హింసాయుతంగా మారాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజాల్గావ్లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే నివాసానికి నిప్పు పెట్టారు. అంతకుముందు గుంపులుగా తరలివచ్చిన నిరసనకారులు ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లు విసిరారు. అక్కడే బయట పార్క్ చేసి ఉన్న కార్లకు నిప్పంటించారు.
ఇటీవలే ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలపై, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 నాటికి మరాఠా కోటా అమలు చేయాలంటూ ప్రభుత్వానికి 40 రోజులు గడువు ఇవ్వడం ఓ పిల్లల ఆటగా మారిందని సోలంకే మాట్లాడినట్లు ఆడియో క్లిప్‌లో ఉందని సమాచారం. దీంతో ఆగ్రహించిన మరాఠీలు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్రకాశ్ సోలంకే ఇంటిపైకి దాడికి దిగారు.
తన ఇంటిపై దాడితో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 'మరాఠా రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులు బీడ్‌లోని మా ఇంటిపై దాడికి దిగి నిప్పంటించారు. ఆ సమయంలో నేను, నా కుటుంబ సభ్యులు, సిబ్బంది ఇంట్లోనే ఉన్నాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది' అని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ట్వీట్ చేశారు.