Maradona watch thief:ఫుట్‌బాల్ దిగ్గజం, దివంగత డీగో మారడోనాకు చెందిన ఖరీదైన చేతి గడియారాన్ని అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ బ్రాండ్ హుబ్లట్ తయారు చేసిన ఈ గడియారాన్ని దుబాయ్ అధికారుల సాయంతో తమ అదుపులోకి తీసుకున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని వాజిద్ హుస్సేన్‌గా గుర్తించారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు సీఎం.
Maradona watch Hublot:
ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచీని వాజిద్ హుస్సేన్ దొంగలించి అసోంకు పారిపోయి వచ్చాడని ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. దీనిపై మారడోనా సంతకం కూడా ఉందని చెప్పారు. 'దుబాయ్ పోలీసుల నుంచి కేంద్ర ఏజెన్సీల ద్వారా మాకు సమాచారం అందింది. ఉదయం 4 గంటలకు వాజిద్‌ను శివ్సాగర్లోని అతని నివాసం నుంచి అరెస్టు చేశాం. వాచీని స్వాధీనం చేసుకున్నాం' అని డీజీపీ వివరించారు.