ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడి ఘటనలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దాడికి రెండు నెలల ముందే మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఐఈడీ పాతిపెట్టారని అధికారులు తేల్చారు. ఐఈడీని పేల్చేందుకు మావోయిస్టులు వైరు ఉపయోగించారని.. దాన్ని ఉంచిన నేలపై గడ్డి పెరగడాన్ని తాము గుర్తించామని అధికారులు తెలిపారు. పేలుడుకు దాదాపు 40 నుంచి 50 కిలోల ఐఈడీ వినియోగించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. దాన్ని పాతిపెట్టేందుకు 3 నుంచి 4 అడుగుల లోతులో.. రోడ్డుపై గొయ్యి తవ్వారని అధికారులు వెల్లడించారు.
దాడి జరిగిన ముందు రోజు బాంబును గుర్తించే టీం.. పోలీసులు ప్రయాణించే మార్గాన్ని తనిఖీ చేసిందని అధికారులు పేర్కొన్నారు. కానీ ఆ ఐఈడీని తాము గుర్తించలేకపోయామని వారు వెల్లడించారు. బాంబును గుర్తించకుండా మావోయిస్టులు.. ఏదైనా పరికరాన్ని అమర్చి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బాంబు గుర్తించేందుకు ఎందుకు వీలు కాలేదన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని వారు పేర్కొన్నారు.
"ఈ ప్రాంతంలో స్థానిక గిరిజన యువకులు కొంతమంది బీజ్ పండుం పండగ కోసం అటుగా వెళ్లే వారి నుంచి డబ్బు వసూలు చేస్తుంటారు. ఇక్కడ ఇది సాధారణమే. ఘటన జరిగిన రోజు కూడా యువకులు డబ్బులు వసూలు చేశారు. దాడి జరిగిన ప్రదేశానికి దాదాపు 200 మీటర్ల ముందు.. ఆ యువకులు ఉన్నారు. స్థానికులు పోలీసులను డబ్బు అడగనప్పటికీ.. వారు స్వచ్ఛందంగానే గిరిజనులకు ఎంతో కొంత ఇస్తుంటారు. పోలీసులపై రెక్కీ నిర్వహించేందుకు.. మావోయిస్టు సభ్యుల్లో ఒకరు ఈ స్థానికుల్లో చేరి ఉండొచ్చు." అని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తి అయిన తరువాత తెలుస్తాయని వారు వెల్లడించారు.
పోలీసులపై దాడి జరిగింది ఇలా..
ఏప్రిల్ 26న ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులపై మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ ఉన్నారు. దాడికి ముందు దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో.. డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్( DRG) పోలీసులు ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు.
మూడు కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసిన పోలీసులు..
మరోవైపు.. బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మూడు కిలోల ఐఈడీని బాంబును.. పోలీసులు శుక్రవారం నిర్వీర్యం చేశారు. గంగలూరు-బీజాపుర్ రోడ్డు మార్గంలోని రెడ్డి చౌక్ వద్ద శుక్రవారం.. ఈ ఐఈడీని పోలీసులు గుర్తించారు. భద్రత బలగాలే లక్ష్యంగా ఐఈడీని మావోయిస్టులు అమర్చారని పోలీసులు తెలిపారు.
మూడు కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసిన పోలీసులు