తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పారిశుద్ధ్యం.. వాస్తవ పరిస్థితికి భిన్నం' - latest news telugu

అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించడం వంటివి తమ ప్రాంతాల్లో లేవని రాష్ట్రాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన వర్క్​షాప్​లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా పరిస్థితులను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు.

Many states make 'tall claims' on zero manual scavengers: NHRC workshop
'మ్యాన్యువల్ పారిశుద్ధ్యం.. వాస్తవ పరిస్థితికి భిన్నం'

By

Published : Jan 5, 2021, 10:29 AM IST

అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవని చాలా రాష్ట్రాలు చెప్పుకుంటున్నా.. పరిస్థితి వాస్తవానికి దూరంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ నిర్వహించిన వర్క్​షాప్​లో అధికారులు పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులను మనుషులతో(మ్యాన్యువల్ స్కావెన్జింగ్) చేయించడం లేదని గొప్పలకు పోతున్నప్పటికీ.. నిజానికి అలాంటి దాఖలాలు లేవని అన్నారు. ఈ అంశాల్లో తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎన్​హెచ్ఆర్సీని కోరారు.

మ్యాన్యువల్ పారిశుద్ధ్యం ఇప్పటికీ కొనసాగడం దేశానికి మచ్చ వంటిదని వర్క్​షాప్​కు అధ్యక్షత వహించిన ఎన్​హెచ్​ఆర్​సీ సభ్యుడు జస్టిస్ పీసీ పంత్ పేర్కొన్నారు. దీన్ని 'సమకాలీన బానిసత్వం'గా అభివర్ణించారు.

కాగా.. వర్క్​షాప్​లో నిపుణులు ఇచ్చిన సలహాలతో ఓ నివేదిక రూపొందించింది ఎన్​హెచ్​ఆర్​సీ. ఇందులోని ముఖ్యమైన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర హోంశాఖ, సామాజిక న్యాయం సాధికారత శాఖలతో పంచుకోనుంది.

సిఫార్సులు, సూచనలు

చేతులతో పారిశుద్ధ్యపని చేసేవారికి పునరావాసం కల్పించాలని వర్క్​షాప్​లో పాల్గొన్న నిపుణులు సూచించారు. వెంటనే ఆదాయం వచ్చే ఉపాధి హామీ వంటి పథకాల్లో ఈ కార్మికులను చేర్చాలని కోరారు. వారి కుటుంబాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అభ్యర్థించారు. మ్యాన్యువల్ పారిశుద్ధ్య నిర్వచన పరిధిని సైతం పెంచాలని అన్నారు. ఇతర ప్రమాదకర పారిశుద్ధ్యాన్ని ఇందులోకి చేర్చాలని పేర్కొన్నారు.

మరోవైపు, పారిశుద్ధ్య విషయంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఎన్​హెచ్​ఆర్​సీకి సూచించారు. అతిక్రమించేవారికి శిక్షలు విధించేలా చట్టాలలో సవరణ చేయాలని పేర్కొన్నారు. పునరావాసానికి ప్రస్తుతమున్న నగదు సాయాన్ని రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. మ్యాన్యువల్ పారిశుద్ధ్య పనుల కోసం నియామకాలు చేపట్టే స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల కోసం ప్రత్యేక యాప్, టోల్​ ఫ్రీ నెంబర్​ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు.

అదేసమయంలో, మురుగునీటిలో పడి మరణించే వారి గణాంకాలను కేంద్ర నేర పరిశోధన బ్యూరో(ఎన్​సీఆర్​బీ) రికార్డు చేసి, తన నివేదికలో పొందుపర్చాలని నిపుణులు పేర్కొన్నారు. మ్యాన్యువల్ పారిశుద్ధ్య కార్మికులకు రుణాలు మంజూరు సౌలభ్యాన్ని రూ.10 లక్షలకు పెంచాలని, నిర్దిష్ట జాతీయ బ్యాంకులకు ఆయా రాష్ట్రాల బాధ్యత అప్పగించాలని సూచించారు.

ఇదీ చదవండి:'తొలి'రోజు జననాలు భారత్​లోనే అధికం

ABOUT THE AUTHOR

...view details