దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రూ.3.15 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో జాప్యం పట్ల పార్లమెంటరీ స్థాయీసంఘం (రవాణా, పర్యాటక, సాంస్కృతికం) అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటివి 27,865 కి.మీ.ల మేర ప్రాజెక్టులున్నట్లు గుర్తించింది. కొత్త ప్రాజెక్టులను ప్రకటించే బదులు వీటిని పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ ఏఐ)లకు స్పష్టం చేసింది. ఈమేరకు టీజీ వెంకటేశ్ నేతృత్వంలోని 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తాజా నివేదికను పార్లమెంటు ముందుంచింది. ఈ ప్రాజెక్టుల్లో జాప్యం కారణంగా అధికసంఖ్యలో రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలకు భారీగా సమయం వృధా అవుతుండటంతో పాటు, ఇంధన వినియోగం కూడా పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టుల వ్యయం కూడా పెరుగుతుండటంతో సంబంధిత శాఖపై భారం పడుతోందని తెలిపింది.
'మహా'లో మహా జాప్యం..
జాప్యాన్ని నివారించే యంత్రాంగం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సూచించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అసాధారణ రీతిలో రహదారి ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని ఇలాంటి ప్రాజెక్టులను వివరించింది. ఈ జాప్యం వెనుక కారణాలను అన్వేషించాలని, ఆయా ప్రాజెక్టులను వీలయినంత త్వరగా పూర్తిచేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,469 కి.మీ.ల మేర రహదారులను పూర్తిచేయడం లక్ష్యం కాగా ఈ ఏడాది జనవరి వరకు కేవలం 2,517 కి.మీ.లు మాత్రమే పూర్తి చేయగలగడం పట్ల అందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే భారత్ మాల పరియోజన ఒకటో దశను 2025-26 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ చేరుకోవడం అసాధ్యమని పేర్కొంది.
ఎన్ హెచ్‌ఏఐపై భారీగా రూ.97,115 కోట్ల రుణభారం ఉండటం పైనా స్థాయీసంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాల్సిందిగా నూచించింది.
ఇదీ చదవండి:రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టం కంప్యూటరీకరణ