Fire accident in Swapnalok Complex: సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని నిత్యం రద్దీగా ఉండే స్వప్నలోక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 8 అంతస్తులన్న ఈ భవనంలోని ఏడో అంతస్తులో నిన్న సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి.
Fire accident at Swapnalok Complex : ఐదో అంతస్తులో పేలుడు సంభవించి.. మంటలు తీవ్రమయ్యాయి. భవనంలో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఇక్కడ పని చేసే వారితో పాటు షాపింగ్ వచ్చిన జనం కిందకు పరుగులు తీశారు.
Swapnalok Complex fire accident update : భవనమంతా పొగ కమ్ముకోవటంతో పైఅంతస్తుల్లో చిక్కుకున్న వారు భయాందోళనతో కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అగ్నిప్రమాదం తర్వాత విద్యుత్తు సరఫరా సైతం నిలిపివేయడంతో తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లతో ఫ్లాష్‌లైట్లు కిందకు చూపిస్తూ కాపాడలంటూ వేడుకున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో పైకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది వారిని కిందకు దించే ప్రయత్నం చేశారు. మరోవైపు మంటలు అదుపు చేసేందుకు దాదాపు పది వరకు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
4 నుంచి 7 అంతస్తుల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. భారీ ఎత్తున నల్లని దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంటల్లో చిక్కుకున్న వారంతా షాపుల వెనుక భాగం నుంచి బాత్‌రూం కిటికీల నుంచి తప్పించుకొని బయటపడ్డారు. అయిదో అంతస్తులోని బీఎమ్ఎస్కార్యాలయంలో మంటలు కారణంగా ఎక్కువ మంది అక్కడే చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మంటల్లో దాదాపు 15 మంది వరకు పైన ఉండిపోవటంతో అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో అతికష్టం మీద వీరిని కిందకు తీసుకువచ్చారు. వీరిలో పొగలో చిక్కుకుని అస్వస్థతకు గురైన శ్రావణ్, భారతమ్మ, సుధీర్‌రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, ప్రశాంత్ పరిస్థితి అత్యంత విషమిస్తుందని గమనించిన అధికారులు అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవటంతో ఈ ఆరుగురు మార్గమధ్యలోనే తుదిశ్వాసవిడిచారు.
చనిపోయిన ప్రశాంత్, వెన్నెల మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. శ్రావణి, శివ వరంగల్ జిల్లా త్రివేణి, ప్రమీల ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా దట్టమైన పొగతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులంతా కాల్‌సెంటర్ బీఎమ్-5 కార్యాలయంలో పనిచేస్తున్న వారిగా పోలీసులు తెలిపారు.
స్వప్నలోక్ కాంప్లెక్ మొత్తం 2 బ్లాకుల్లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 400 వరకు షాపులు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీగా కన్పిస్తుంది. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 3 వేల మంది వరకు పనిచేస్తుంటారు. సెల్లార్, గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో 170 వరకు షాపులు ఉన్నాయి. ఇక్కడే ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగతా అంతస్తుల్లో కార్యాలయాలు కొనసాగుతుంటాయి. ఇవన్నీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కొక్కటి మూతపడుతూ ఉంటాయి.