ఉత్తర్ప్రదేశ్, హాపుడ్ జిల్లాలోని ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. పేలుడు ధాటికి పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. అందులో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
సీఎం యోగి దిగ్భ్రాంతి:బాయిలర్ పేలు పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మీరట్ ఐజీ ప్రవీణ్ కుమార్, హాపుడ్ డీఎం సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
"హాపుడ్లోని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆశుపత్రులకు తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం."