కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మర్రి చెట్టుకు ఓ వాహనం బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. యల్లమ్మ దర్శనం కోసం సవదత్తి ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఆరుగురు భక్తులు దుర్మరణం..
రోడ్డు పక్కన మర్రి చెట్టుకు బలంగా ఢీకొట్టి వాహనం బోల్తా పడిన ఘటనలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హులకుంట గ్రామానికి చెందిన కొందరు భక్తులు.. యల్లమ్మ ఆలయానికి ఓ గూడ్స్ వాహనంలో బయలుదేరారు. చుంచునూరు గ్రామ సమీపంలోని విఠలప్ప దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద మర్రిచెట్టును వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనం బోల్తాపడి నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఐదుగురు భక్తులు మరణించారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో మరో భక్తుడు మరణించాడు.