లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం - 8 labour died in lift incident gujarat

13:13 September 14
లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం
Ahmedabad Lift Accident Today : గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో లిఫ్ట్ షాఫ్ట్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత కూలీలతో వెళ్తున్న లిఫ్ట్ కూలిందని భావించారు పోలీసులు. అనంతరం విచారించగా లిఫ్ట్ షాఫ్ట్ కూలిపోవడమే ప్రమాదానికి కారణమని తేలింది.
"ఆరుగరు కూలీలు గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్‌కు మరమ్మతులు చేస్తున్నారు. 13వ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ షాఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఐదో అంతస్తులో ఉన్న ఇద్దరు కూలీలు అదుపుతప్పి లిఫ్ట్ గుంతలో పడిపోయారు. మొత్తం 8 మంది కూలీలపై షాప్ట్ పడగా.. ఏడుగురు మరణించారు." అని పోలీసులు తెలిపారు. మృతులను పంచమహల్ జిల్లాలోని ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్‌ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు.