కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలిలో మంజునాథ స్వామిని దర్శించుకుని టెంపో ట్రావెలర్‌లో తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
పాల ట్యాంకర్, బస్సు మధ్య నలిగి 9 మంది మృతి.. అందరిదీ ఒకే ఫ్యామిలీ! - కర్ణాటక రోడ్డు ప్రమాదం
పాల ట్యాంకర్, బస్సు, టెంపో ట్రావెలర్ ఒకేసారి ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక హాసన్‌లోని అర్సికేరెలో శనివారం రాత్రి 11 గంటలకు జరిగిందీ ఘోర ప్రమాదం.
హాసన్ జిల్లా అర్సికేరె మండలం గాంధీనగర్ గ్రామం వద్ద శనివారం రాత్రి 11 గంటలకు మూడు వాహనాలు ఒకేసారి పరస్పరం ఢీకొన్నాయి. పాల ట్యాంకర్, కర్ణాటక ఆర్టీసీ బస్సు మధ్యలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జు అయింది. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం సమయంలో దాదాపు అందరూ నిద్రపోతున్నారు. ఏం జరిగిందో తెలిసే లోపే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు. అయితే.. దారిలోనే మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇంత మంది మృతితో.. వారి స్వస్థలంలో తీవ్ర విషాదం నెలకొంది.