గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 36కు చేరింది. భావ్‌నగర్, బోటాడ్, బర్వాలాలోని ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. బోటాడ్ జిల్లాతో పాటు, అహ్మదాబాద్‌లోని ధంధూకా ప్రాంతంలో అనేక మంది ప్రజలు కల్తీ మద్యానికి బాధితులుగా మారారని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పేరుతో ప్రమాదకర రసాయనాలను విక్రయించినట్లు తేలింది. మిథైల్ ఆల్కహాల్ అనే రసాయనాన్ని నీటిలో కలిపి.. మద్యం పేరిట విక్రయాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రూ.20కే సీసా చొప్పున వీటిని అమ్మినట్లు చెప్పారు. బాధితుల్లో చాలా మంది మిథనాల్ కలిపిన రసాయనాన్నే సేవించినట్లు తెలిపారు. మద్యంలో 99 శాతం రసాయనాలే ఉన్నాయని చెప్పారు.