Golden Tea 1kg Price: మన దేశంలో చాయ్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ అసోం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తి అయిన టీ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం.. మనోహరి గోల్డ్ టీ రికార్డ్ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది.
సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ఈ గోల్డ్ టీని కొనుగోలు చేసినట్లు గువాహటి టీ ఆక్షన్ సెంటర్ కార్యదర్శి దినేశ్ బిహానీ వెల్లడించారు. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు బిహానీ. ఉత్పత్తి సంస్థలు కూడా ఇలాంటి టీ పొడులను మరిన్ని విక్రయించి.. దేశాన్ని ప్రత్యేక టీ పొడులకు కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 850 టీ గార్డెన్స్ ఉన్నాయి. ఏటా 650 మిలియన్ కిలోల టీని అసోం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం.