దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే కొవిడ్ మహమ్మారిని అడ్డుకోవచ్చంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇప్పటి వరకూ టీకాలు తీసుకున్న వారి సంఖ్యపై కాకుండా దేశ జనాభాలో ఇంకా టీకా పొందని వారిపై దృష్టి సారించాలని సూచించారు.
" టీకా పంపిణీని వేగవంతం చేయటమే కొవిడ్-19పై పోరులో కీలకం.వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను కాకుండా తీసుకోవాల్సిన వారిపై దృష్టి సారించాలి. భారత్లో చాలా తక్కువ మందికి వ్యాక్సిన్ అందింది. త్వరితగతిన, సరైన రీతిలో ముందుకు సాగాలి. వచ్చే ఆరునెలల కాలానికి టీకాల కోసం చేసిన ఆర్డర్లు, టీకాల సరఫరాకు వచ్చిన అంగీకారాలను ప్రజలకు తెలియజేయాలి. "
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని.
రాష్ట్రాలకు టీకాలను ఏ ప్రకారం పంపిణీ చేస్తారనేది తెలియజేయాలని సూచించారు మన్మోహన్. నిర్మాణాత్మక సహకర స్ఫూర్తితో సలహాలు, సూచనలతో లేఖరాసినట్లు పేర్కొన్నారు.
టీకాల కోసం మోదీకి దీదీ లేఖ..
తమ రాష్ట్రానికి 5.4 కోట్ల టీకా డోసులను అందించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వాటితో పాటు రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ ఔషధాలు, ఆక్సిజన్లను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు.
"కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా అవసరం పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.7 కోట్ల మందికి టీకా అందించాం. మరో 5.4 కోట్ల డోసులు తక్షణం అవసరం ఉంది. రోజుకు 6వేల రెమిడెసివిర్ వయల్స్, వెయ్యి టొసిలిజుమాబ్ వయల్స్ అవసరమవుతున్నాయి, కానీ, ప్రస్తుతం వెయ్యి రెమిడెసివిర్ వయల్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. టొసిలిజుమాబ్ సరఫరా అస్సలే లేదు."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
టీకా కోసం స్టాలిన్ విజ్ఞప్తి
తమిళనాడు ప్రభుత్వం కోరిన 20 లక్షల కొవిడ్ టీకా డోసులను వెంటనే పంపించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్. రాష్ట్ర జనాభకు తగినట్లు టీకాల సరఫరా చేయాలని లేఖ రాశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి:వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై మోదీ సమీక్ష