దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశే సిసోదియా మరో రెండు వారాల పాటు జైలులో ఉండనున్నారు. ఆయనకు మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. సోమవారం.. దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన సిసోదియా.. గత వారం రోజులుగా సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. సోమవారం ఆయన కస్టడీ ముగిసింది. దీంతో మధ్యాహ్నం ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట సిసోదియాను.. సీబీఐ అధికారులు హాజరు పరిచారు.
సిసోదియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. ఆయన అనేక విషయాలు దాచిపెడుతున్నారని తెలిపారు. ఆప్ మద్దతుదారులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ప్రస్తుతానికి సిసోదియా కస్టడీ తమకు అవసరం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తరువాత అవసరం కావచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇరువురి పక్షాల వాదనలు విన్న కోర్టు.. సిసోదియాకు రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జైలులో మనీశ్ సిసోదియాకు ఓ డైరీ, పెన్, భగవద్గీతను తీసుకువెళ్లేందుకు అనుమతి కావాలని.. ఆయన న్యాయవాది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును కోరారు. ఇందుకు కోర్టు సమ్మతించింది. వాటిని తీసుకువెళ్లేందుకు సిసోదియాకు అనుమతించాలని తీహాడ్ జైలు అధికారులను ఆదేశించింది.