Manish Sisodia Supreme Court Today :దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టయిన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
'రూ.338 కోట్ల నగదు బదిలీకి..'
అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే.. సిసోదియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
'కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం పక్కా!'
Manish Sisodia Latest News :సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరణపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. "దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతితో నిండి ఉందని రుజువైంది. ఇక ఆప్ అగ్రనేతల అరెస్ట్‌కు సమయం దగ్గర పడింది. అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే అరెస్ట్ అవుతారు" అని వ్యాఖ్యానించారు.