Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ప్రధాన అనుచరుడు దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీబీఐ కోర్టుకు ఆయన నివేదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారి.. వాస్తవాలు బయటపెడతానని విచారణ సందర్బంగా న్యాయమూర్తికి వివరించారు. ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి ఉందా అని జడ్జి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. సీబీఐ నుంచిగానీ, ఇతరుల నుంచి గానీ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని దినేశ్ అరోరా స్పష్టం చేశారు.
సున్నితమైన ఈ కేసు విచారణకు మీడియాను దూరంగా ఉంచాలని అరోరా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు సీబీఐ కూడా అంగీకరించింది. అయితే దినేశ్ అరోరాను అప్రూవర్‌గా అంగీకరించడంపై ఈనెల 14న తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జడ్జి ఎంకే నాగ్‌పాల్ ప్రకటించారు. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలన్న అరోరా పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు ఆలకిస్తామని స్పష్టం చేశారు.