Manipur Woman Paraded Viral Video : మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయంలో మరో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఖండిస్తున్నారు. ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి.
అయితే, ఈ ఘటన సేనాపతి జిల్లాలో మే 4న జరిగిందని మణిపుర్‌కు చెందిన ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) ఆరోపించింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి పంట పొలాల్లో సామూహిక అత్యాచారం చేశారని ఆరోపణలు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీఎల్ఎఫ్ డిమాండ్ చేసింది.
సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన..
మణిపుర్‌లో మహిళలపై అమానవీయ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇలాంటి ఘటన ఆమోదయోగ్యం కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్గ కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణం అన్నారు. ఆ వీడియోల వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే తరుణం ఇదేనని అన్నారు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదని.. ఈ ఘటన తీవ్రంగా కలవరపెడుతోందని చెప్పారు. నేరస్థులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళ కమిషన్..
ఈ ఘటనను జాతీయ మహిళ కమిషన్ ఖండించింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మణిపుర్ డీజీపీని ఆదేశించింది.
ఎవ్వరినీ వదలం : ప్రధాని మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.
ఈ ఘటన అమానవీయం : స్మృతి ఇరానీ
ఈ వీడియో బయటకు రావడం వల్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడారు. 'ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల భయంకరమైన వీడియో ఖండించదగినది, అమానవీయమైనది. మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌తో మాట్లాడాను. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని నాకు తెలియజేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నమూ వదులుకోనని హామీ ఇచ్చారు' అని మంత్రి ట్వీట్ చేశారు.
ఉరిశిక్ష పడేలా చేస్తాం : మణిపుర్ ముఖ్యమంత్రి
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై మణిపుర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'వీడియో బయటపడిన వెంటనే ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఈరోజు ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరణ దండన పడేలా చూస్తాం' అని ట్వీట్ చేశారు.
నిందితుడి అరెస్టు..
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ట్విట్టర్‌పై చర్యలు?
అటు ఈ వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విట్టర్‌తో సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 'ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలి' అని కేంద్రం పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
'ఇండియా' మౌనంగా ఉండదు : రాహుల్ గాంధీ
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయి. కానీ 'ఇండియా' (ప్రతిపక్షాల కూటమి) మౌనంగా ఉండదు. మణిపుర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి మన ముందున్న ఏకైక మార్గం' అని కేంద్ర సర్కారుపై ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఇలాంటి ఘటన సిగ్గుచేటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని అన్నారు.