Manipur woman paraded : మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి నిందితుల కోసం వేట కొనసాగుతోంది. ప్రధాన నిందితుల్లో మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తాజాగా మణిపుర్ పోలీసులు వెల్లడించారు. దీంతో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరిందని వెల్లడించారు. వైరల్ వీడియోలో కనిపించిన మిగతా అనుమానితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మణిపుర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో 126 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
Manipur video : గాలింపు చర్యల్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సరైన సమాచారం తెలుసుకునేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. తాజాగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 413 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Manipur incident : ఈ అమానవీయ ఘటనలో ఇదివరకే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడిని 32 ఏళ్ల హురైన్ హెరదాస్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నలుగురు నిందితులను శుక్రవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వారిని 11 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రధాన నిందితుడైన హురైన్ ఇంటిపై స్థానిక మహిళలు శుక్రవారం దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేసి టైర్లతో కాల్చివేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా గ్రామంలో భద్రత పెంచారు.
అసలు మణిపుర్‌లో ఏమైంది?
జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్ అట్టుడుకుతోంది. మే 3న రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఆ తర్వాతి రోజు జరిగిన అమానుష ఘటనకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళలపైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు సైతం వచ్చాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ రోజు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.