తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మణిపుర్​లో పరిస్థితులు శాంతం.. 100 మంది మృతి!.. దిల్లీకి పాకిన హింస - మణిపూర్ హింస వార్తలు

హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఇటీవల కుకి, మైతై తెగల మధ్య ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టాన్ని తలపించగా.. ఈ ఉదయం నుంచి ఇంఫాల్‌ సహా అల్లర్లు జరిగిన ఇతర ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాలు మొదలయ్యాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు, దిల్లీ యూనివర్సిటీలోని మణిపుర్‌ విద్యార్థులు ఘర్షణ పడ్డారు.

Manipur violence
Manipur violence

By

Published : May 6, 2023, 9:55 PM IST

గత కొన్నిరోజులుగా అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచే ఇంఫాల్‌సహా ఇతర ప్రాంతాల్లో దుకాణాలు, మార్కెట్లు మళ్లీ తెరుచుకోవటం సహా రోడ్లపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు కూడా రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధాన ప్రాంతాలు, కూడళ్లతోపాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను మోహరించారు.

ఘర్షణల్లో ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 54కు పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మృతిచెందిన 54మందిలో 16మృతదేహాలు చురచాంద్‌పుర్‌ ఆస్పత్రిలో, మరో 15మృతదేహాలు ఇంఫాల్‌ తూర్పు జిల్లా వైద్యశాలలో, మరో 23మృతదేహాలు ఇంఫాల్‌ పశ్చిమ జిల్లా ఆస్పత్రిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనధికారికంగా మృతుల సంఖ్య వందకు పైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కనీసం 200 మంది గాయపడి ఉంటారని సమాచారం.

మరోవైపు, మణిపుర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ తెలిపారు. సైన్యం, అసోం రైఫిల్స్‌ సాయం అభ్యర్థించినట్లు చెప్పారు. హోం శాఖ ఆదేశాల మేరకు వెయ్యి మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మణిపుర్‌కు తరలించారు. ఆర్మీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో 13 వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు.

అఖిలపక్ష భేటీ
ఘర్షణల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు మణిపుర్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించింది. కాంగ్రెస్, సీపీఐ, జేడీయూ, ఎన్​పీఎఫ్, శివసేన, టీఎంసీ, ఆప్ సహా వివిధ పార్టీలు ఈ భేటీకి హాజరయ్యాయి.

మణిపుర్ నుంచి తమ ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు మిజోరం అధికారులు వెల్లడించారు. విమానాల్లో వీరిని తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అయితే తమ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిందని మిజోరం అధికారులు చెప్పారు. ప్రైవేటు ఎయిర్​లైన్​కు కూడా అనుమతులు నిరాకరించిందని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించలేదు.

దిల్లీలో ఘర్షణ
మణిపుర్‌లో పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుంటే.. తాజాగా ఘర్షణలు దేశ రాజధాని దిల్లీకి పాకాయి. దిల్లీ యూనివర్సిటీలో కుకీ తెగకు చెందిన మణిపుర్‌ విద్యార్థుల బృందం... తమపై దాడికి పాల్పడినట్లు మైతై తెగకు చెందిన విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో.. పోలీసుస్టేషన్‌ బయట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని మైతై తెగకు చెందిన విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details