Manipur Violence Supreme Court Hearing : మణిపుర్లో దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న హింస కారణంగా ప్రభావితమైన బాధితుల ఉపశమనం, పునరావాసం కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ఈ కమిటీకి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహిస్తారని.. జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆషా మేనన్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. హింస చెలరేగిన రాష్ట్రంలో న్యాయ పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తమ ప్రయత్నమని తెలిపింది. ఈ మేరకు మణిపుర్ అల్లర్లపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి, ఉత్తర్వులు జారీ చేసింది.
Manipur Violence Investigation Committee : మాజీ న్యాయమూర్తుల కమిటీతోపాటు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ దర్యాప్తు చేసే క్రిమినల్ కేసులను కూడా పోలీసు ఉన్నతాధికారులను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించనున్నట్లు సుప్రీం తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆర్డర్‌ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు సీబీఐ విచారించబోయే కేసులను ఒక ఐపీఎస్ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపింది.
Manipur Violence Case 2023 : విచారణ సందర్భంగా కేంద్రం, రాష్ట్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మణిపుర్ హింసపై కుప్పలు తెప్పలుగా నమోదైన కేసులను వేరు చేయడం సహా తదితర అంశాలపై సుప్రీం కోర్టు కోరిన నివేదికను సమర్పించారు. సున్నితమైన మణిపుర్ అల్లర్ల విషయంలో పరిణతితో వ్యవహరిస్తోందని ధర్మాసనానికి అటార్నీ జనరల్ తెలిపారు. అయితే, పునరావాసం ఇతర ఉపశమన చర్యల కోసం దాఖలైన 10 పిటిషన్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా మణిపుర్ డీజీపీ రాజీవ్ సింగ్ కూడా ధర్మాసనం ముందు హాజరయ్యారు. మణిపుర్ జాతి అల్లర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై కోర్టుకు సమాధానం ఇచ్చారు.