Manipur Violence News :మణిపుర్లో సాయుధ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను తుపాకులతో దారుణంగా కాల్చిచంపారు దుండగులు. నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన ఐదారుగురు దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. కంగ్పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు వెల్లడించారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్‌చుప్ గ్రామంపై దాడికి దిగారని చెప్పారు. దీంతో గ్రామస్థులు సైతం ప్రతిదాడులు చేశారని చెప్పారు.
నిరసన ర్యాలీ
వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్‌లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన యూనిఫైడ్ కమాండ్ ఛైర్మన్ కుల్దీప్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసం, రాజ్‌భవన్ వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. రాజ్‌భవన్‌కు 300 మీటర్ల దూరంలో మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా- ఘర్షణ తలెత్తింది. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు.