Manipur Violence Militants Attack :మణిపుర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పోలీస్ కమాండోలపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తెంగ్‌నౌపాల్ జిల్లాలోని మోరేలో శనివారం 3:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భారత్ - మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి కీలక ప్రాంతాలకు వెళుతున్న పోలీసు కమాండో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని సాయుధులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మొదట రెండు బాంబులు పేలాయని, ఆ తర్వాత 350 నుంచి 400 రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇరు వైపుల కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడగా అసోం రైఫిల్స్ క్యాంపులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్- ఐఆర్బీకి చెందిన పొన్‌ఖలుంగ్‌గా గుర్తించారు. మరోవైపు, మోరేలో రెండు ఇళ్లను తగులబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూ మోరే గేట్ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
మరోవైపు, శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ రక్షకుడిని కాల్చి చంపారు. మృతుడిని జమేశ్ నింగోంబమ్గా గుర్తించారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని కదంగ్బాండ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టు మార్టం పరీక్షల కోసం సమీపంలోని మెడికల్ కాలేజీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సమీపంలోని పర్వత ప్రాంతానికి చెందిన వ్యక్తులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం కంగ్పోక్పి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ కంగ్పోక్పి జిల్లాలోనే మే 3న అల్లర్లు చెలరేగడం గమనార్హం.