Manipur Violence : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వేళ.. మణిపుర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంది. ఆదివారం భద్రతాదళాలు, వేర్పాటు వాదుల మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారు. ఈ క్రమంలోనే సహాయక చర్యలను వేగవంతం చేసింది ఇండియన్ ఆర్మీ. కక్చింగ్ జిల్లాలోని సుగ్ను, సెరౌ గ్రామాల్లోని నిర్వాసితులను పునరావస కేంద్రాలకు తరలించినట్లు సైన్యం తెలిపింది. సెరౌ గ్రామంలోని 2,000 మంది పౌరులను, సుగ్ను నుంచి 328 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పింది. ఇండియన్ ఆర్మీతో పాటు అసోం రైఫిల్స్‌కు చెందిన దళాలు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మైన్ ప్రొటెక్టడ్ వాహనాలతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి.
Amit Shah Manipur Visit : ఇటీవలే మణిపుర్ హింసాత్మకంగా మారిన వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ పర్యటన చేపట్టారు. పరిస్థితులను అంచనా వేసేందుకు.. సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై భద్రతా సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపుర్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. మే 29న మణిపుర్‌కు చేరుకుని.. జూన్ 1 వరకు ఇక్కడే ఉండనున్నారు. అల్లర్లు మొదలైన తర్వాత ఆ రాష్ట్రంలో తొలిసారి షా పర్యటించనున్నారు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు చల్లార్చే విషయమై హోంమంత్రి మణిపుర్ పర్యటన సాగనుంది. ఆయనకు స్వాగతం పలుకుతూ మణిపుర్ ప్రజలు పోస్టర్లు ఏర్పాటు చేశారు.
Manipur Violence Update : భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 25 మంది వేర్పాటువాదులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఐదు 12 బోర్ డబుల్ బ్యారల్ రైఫిల్స్, 3 సింగల్ బ్యారల్ రైఫిల్స్, ఒక నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని మణిపుర్ పోలీసులకు అప్పగించినట్లు సైన్యం తెలిపింది.
వేర్పాటువాదుల కుట్ర భగ్నం
అంతకుముందు మణిపుర్‌లో భయానక వాతావరణం సృష్టించేందుకు వేర్పాటు వాదులు పన్నిన కుట్రను భారత సైన్యానికి చెందిన స్పియర్ కోర్ కమాండ్ బహిర్గతం చేసింది. మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న వేర్పాటు వాదుల కుట్రను సైన్యం బహిర్గతం చేసింది. వేర్పాటువాదల కమ్యూనికేషన్ వ్యవస్థపై నిఘా పెట్టిన సైన్యం.. వారి సంభాషణలను గ్రహించింది. సైన్యాన్ని అడ్డుకునేందుకు అమాయక పౌరులను వాడుకోవాలనే ప్రణాళికలపై వేర్పాటువాదులు చర్చించినట్లు తెలుస్తోంది.