Manipur Violence High Court Order : మణిపుర్ హింసలో ప్రాణాలు కోల్పోయిన.. కుకీ-జో ప్రజల సామూహిక ఖననం కోసం ప్రతిపాదించిన స్థలంపై.. మణిపుర్ హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఈ మేరకు సామూహిక ఖనన స్థలంపై ఉదయం 6 గంటలకు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు.. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. వివాదాస్పద ఈ స్థలంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే మరింత హింస జరిగే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, భద్రతా బలగాలతో పాటు ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు 5 రోజులు అంత్యక్రియలు వాయిదా వేసినట్లు కుకి జోమి తెగ ప్రకటించింది. తమ ఐదు డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపింది.
అల్లర్లలో మృతి చెందిన 35మంది అంత్యక్రియలను సామూహికంగా నిర్వహించాలని కుకీ-జో తెగ నిర్ణయించింది. చురాచాంద్‌పుర్ జిల్లా హవోలై ఖోపి గ్రామంలో సామూహిక ఖననం చేయాలని భావించింది. ప్రతిపాదిత స్థలం గతంలో మైతేయిలు నివసించినదని ఆ వర్గం ప్రజలు చెబుతున్నారు. అక్కడ కొత్త శ్మశానం సృష్టించడం కవ్వించడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. చనిపోయినవారిని వారి గ్రామాల్లో ఖననం చేయాలని మైతేయి సహా వివిధ సంఘాలు.. కుకి తెగవారిని కోరాయి. ఈ నేపథ్యంలో కోర్టు స్టేటస్ కో విధించింది.