Manipur Violence Army : మణిపుర్‌లో హింసకు పాల్పడుతున్న 12 మంది మైతై మిలిటెంట్లను అరెస్టు చేసిన భారత సైన్యం.. స్థానికంగా మహిళల తిరుగుబాటు చెలరేగడం వల్ల వారందరినీ విడుదల చేసింది. కఠిన చర్యలు తీసుకుంటే స్థానికుల ప్రాణాలకు ప్రమాదమని భావించిన సైన్యం.. వారిని విడిచిపెట్టింది.
అసలేం జరిగిందంటే?
Manipur Women : ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఆపరేషన్ చేపట్టాయి. హింసను ప్రేరేపిస్తున్న 12 మంది కంగ్లీ యావోల్ కన్న లుప్ తీవ్రవాద ముఠా సభ్యులను ఇతాం గ్రామంలో భద్రతాదళాలు అరెస్టు చేశాయి. 2015లో '6 డోగ్రా యూనిట్'పై ఆకస్మిక దాడితో సహా అనేక ఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. దీంతోపాటు పెద్దఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆ సంస్థ సానుభూతిపరులు.. దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినా.. ఫలితం లేకపోయింది. ఇలా ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వారిని విడిచిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో.. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్లు పేర్కొంది.
మణిపుర్‌లో శాంతిని నెలకొల్పుతాం: అమిత్ షా
మరోవైపు, దిల్లీలో మణిపుర్ పరిస్థితులపై శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా.. త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులునెలకొంటాయని హామీ ఇచ్చారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి హాజరైన 18 పార్టీల అభిప్రాయాలన్నింటినీ విన్న తర్వాత అమిత్ షా.. పలు అంశాలపై మాట్లాడారు.