తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Manipur Violence : విద్యార్థుల హత్యతో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యేకాధికారాల చట్టం మరో 6 నెలలు పొడిగింపు - మణిపుర్ హింస న్యూస్

Manipur Violence : జాతుల మధ్య వైరంతో ఘర్షణలు జరిగిన మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైతేయ్‌ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన దృశ్యాలు వెలుగులోకి రావటం వల్ల మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయంటూ బీరెన్‌సింగ్‌ ప్రభుత్వం.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Manipur Violence
Manipur Violence

By PTI

Published : Sep 27, 2023, 5:58 PM IST

Manipur Violence : మణిపుర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విద్యార్థుల హత్యతో మణిపుర్‌ మరోసారి ఆందోళనలతో అట్టుడికింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం వల్ల మణిపుర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం పరిధిని విస్తరించినట్లు బీరెన్‌సింగ్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

మే మూడో తేదీ నుంచి జాతుల మధ్య వైరంతో మణిపుర్‌ అట్టుడికిన సమయంలో మైతేయ్‌ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటం వల్ల మరోసారి ఆందోళనలు జరిగాయి. ఈ హత్యలను ఖండిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం బీరెన్‌సింగ్‌ నివాసానికి సమీపంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. బీరెన్‌సింగ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ప్రకటించిన సర్కారు.. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రం అసోంతో సరిహద్దు కలిగిన ఇంఫాల్‌ లోయలోని 19 పోలీసు స్టేషన్లను ఈ చట్టం నుంచి మినహాయించినట్లు ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో మైతేయ్‌ వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక అధికారాల చట్టం నుంచి మినహాయించిన 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా సైన్యం, అసోం రైఫిల్స్‌ ఆ ప్రాంతాల్లో ప్రవేశించటానికి వీలుండదు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 నెలల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలకు విశేషాధికారాలు లభిస్తాయి. వారెంట్‌ లేకుండా ఎక్కడైనా సోదాలు నిర్వహించటమే కాకుండా ఎవరినైనా అరెస్ట్‌ చేయొచ్చు. సైనికులు ఎవరినైనా కాల్చి చంపినా.. వారిపై ఎలాంటి విచారణ ఉండదు. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఈ చట్టం అమల్లో ఉండగా.. గతేడాది మణిపుర్‌లో ఈ చట్టం పరిధిని కుదించారు.

Manipur Students Death : మణిపుర్​కు సీబీఐ.. విద్యార్థుల హత్యపై దర్యాప్తు.. హంతకులను వదిలేదిలేదన్న సీఎం!

Manipur Students Killed : మణిపుర్‌లో మరో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details