తెలంగాణ

telangana

ETV Bharat / bharat

40 మంది తిరుగుబాటుదారులు హతం.. ఇద్దరు పౌరులు మృతి.. మణిపుర్​కు అమిత్​ షా! - 40 మంది తిరుగుబాటుదారులను చంపిన భద్రత దళాలు

రక్షణాత్మక కార్యకలాపాలలో భాగంగా 40 మంది తిరుగుబాటుదారులను చంపినట్లు మణిపుర్‌ ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య పౌరులపై మారణాయుధాలతో కాల్పులకు దిగిన తిరుగుబాటుదారులను.. వివిధ ప్రాంతాల్లో కాల్చిచంపినట్లు మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ తెలిపారు. ఈ అల్లర్లలో ఇద్దరు పౌరులు మృతిచెందారు.

manipur-violence-2023-govt-killed-several-terrorists-in-manipur
manipur-violence-2023-govt-killed-several-terrorists-in-manipur

By

Published : May 28, 2023, 6:56 PM IST

Updated : May 28, 2023, 8:06 PM IST

Manipur Violence : తిరుగుబాటుదారులపై మణిపుర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చేపట్టిన ఆపరేషన్​లో మొత్తం 40 మందిని మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం ఆరు చోట్ల దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పౌరులు కూడా మృతి చెందినట్లు అధికారులు వివరించారు. మరో 12 మంది గాయపడ్డారు. చాలామంది మిలిటెంట్లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. మణిపుర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఉగ్రవాదులకు.. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు.

"సాధారణ పౌరులపై ఎమ్‌-16, ఏకే-47, స్నైపర్‌ గన్లతో తిరుగుబాటుదారులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లకు సైతం నిప్పు పెడుతున్నారు. దీనిపై వెంటనే అప్రమత్తమయ్యాం. దీంతో ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతా బలగాల సాయంతో తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది తిరుగుబాటుదారులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి." అని ఎన్‌. బీరేన్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. వాళ్లని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని.. ఉగ్రవాదులుగానే భావిస్తామని ఆయన పేర్కొన్నారు. నిరాయుధులైన సాధారణ ప్రజలపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడుతున్నారని బీరేన్‌ సింగ్​ తెలిపారు.

కాగా శనివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు తదితర ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డారు వేర్పాటువాదులు. అనంతరం అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని తిరిగి ఎదురు కాల్పులు ప్రారంభించారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు సమాచారం. దాదాపు 12 మంది వ్యక్తులు బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ హింసాత్మక పరిస్థితులో నెలకొన్నాయి. ఎస్టీ హోదా కోసం మెయిటీల డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు.

మణిపుర్​కు అమిత్ షా
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపుర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని పాటించి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని మెయిటీ, కుకీ గిరిజన తెగ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారమే మణిపుర్ చేరుకున్నారు.

Last Updated : May 28, 2023, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details