తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి.. మరో 60 మంది... - మణిపుర్ నోనె జిల్లా వరదలు

Manipur Tupul landslides: మణిపుర్​లో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సైనికులు కూడా ఉన్నారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Manipur Tupil railway landslides
Manipur Tupil railway landslides

By

Published : Jun 30, 2022, 3:15 PM IST

Updated : Jul 1, 2022, 6:49 AM IST

కొండ విరిగిపడి సైనికులు మృతి

Manipur Tupul landslides: భీకర వరదలు ఈశాన్య భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా మణిపుర్​లోని నోనె పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రైల్వే పనులు జరుగుతున్న తుపుల్ యార్డ్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఇంకా చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల్లో సుమారు 60 మంది చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతం

"మొత్తం 60 మంది ఆచూకీ తెలియలేదు. ఇందులో 23 మంది సైనికులు ఉన్నారు. రైల్వే అధికారులు, కూలీలు సైతం ఆచూకీ కోల్పోయినవారిలో ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజెయ్ నది ప్రవాహం ఆగిపోయింది. వరద నీరు రిజర్వాయర్​లా మారింది. నీటి ప్రభావానికి శిథిలాలు ఒక్కసారిగా పక్కకు జరిగిపోతే.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయి. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను బయటకు రానీయొద్దు" అని నోనె జిల్లా ఎస్డీఓ సోలోమన్ ఫైమేట్ స్పష్టం చేశారు.

సహాయక చర్యలు

జిరిబం- ఇంఫాల్ కొత్త లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తుపుల్ స్టేషన్ భవనం వరదలకు దెబ్బతిందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్​ను సైతం వరదలు దెబ్బతీశాయని చెప్పారు. నిర్మాణంలో పాల్గొంటున్న కూలీల శిబిరాలు సైతం ధ్వంసమయ్యాయని వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు స్పష్టం చేశారు. మణిపుర్ సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 9 మందిని కాపాడినట్లు తెలిపారు. వీరికి నోనె ఆర్మీ మెడికల్ యూనిట్​లో చికిత్స కొనసాగుతోందని వివరించారు.

రంగంలోకి ఎన్​డీఆర్ఎఫ్
ఈ నేపథ్యంలో మణిపుర్ సీఎం బీరెన్ సింగ్​, రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్​తో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. సహాయక చర్యల కోసం ఎన్​డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుందని చెప్పిన ఆయన.. మరో రెండు బృందాలు సైతం వస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details