Manipur Students Killed : కొన్ని రోజులుగా జాతుల మధ్య హింసతో రగిలిపోతున్న మణిపుర్‌లో మరో దారుణం జరిగింది. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు.. సాయుధ మూకల చేతిలో హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు సోమవారం రాత్రి నుంచి... సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను మణిపుర్ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది.
సోషల్ మీడియాలో మృతదేహాల ఫొటోలు వైరల్
ఈ క్రమంలో సోమవారం నుంచి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ఉన్న ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు అపహరించి హత్యచేసినట్లు ఆ ఫొటోలను బట్టి తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఉన్న ఒక ఫొటోలో.. వెనుక సాయుధులు నిలబడి ఉన్నారు. పొదల మధ్య విద్యార్థుల మృతదేహాలను పడేసిన.. మరో ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
17 ఏళ్ల అమ్మాయి- 20 ఏళ్ల అబ్బాయి!
Manipur Students Death : హత్యకు గురైన విద్యార్థులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా ప్రభుత్వం గుర్తించింది. జులై 6న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. జులై 6న అమ్మాయి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి వారి జాడ లేదు. ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్కాగా.. వారి ఫోన్ సిగ్నల్స్ చివరిగా చురాచాంద్‌పుర్ జిల్లాలోని వింటర్ ఫ్లవర్ టూరిస్ట్ కేంద్రం వద్ద ఉన్నట్లు గుర్తించారు.
'సంయమనం పాటించండి'
అక్కడి నుంచే విద్యార్థులను అపహరించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఇప్పటికే సీబీఐకిఅప్పగించినట్లు మణిపుర్ ప్రభుత్వం తెలిపింది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. కుకీ వర్గానికి చెందిన దుండగులే వారిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా సంయమనం పాటించాలని మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం
Manipur Students News : కేంద్ర బలగాల సాయంతో రాష్ట్ర పోలీసులు.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మణిపుర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో ఉన్న.. సాయుధుల ముఖాలు గుర్తించడం కష్టంగా ఉండడం వల్ల సైబర్ ఫోరెన్సిక్ ఉపకరణాలతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.