Manipur Students Death : రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ బృందం ఇంఫాల్‌కు చేరుకోనుంది. సీబీఐ డైరెక్టర్‌తో పాటు బృందం.. ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం రాష్ట్రానికి రానున్నట్లు మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. అత్యంత దారుణానికి పాల్పడ్డ హంతకులను కోర్టు ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు.
మళ్లీ ఇంటర్నెట్ నిషేధం..
Manipur Internet Ban : జులైలో మైతెయ్ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురై అనంతరం దారుణ హత్యకు గురయ్యారు. మే నుంచి ఇక్కడ ఇంటర్నెట్ పై నిషేధం ఉండటం వల్ల విషయం బయటకు రాలేదు. సెప్టెంబర్ 23న అంతర్జాలంపై నిషేధం ఎత్తివేయడం వల్ల సోమవారం నుంచి విద్యార్థుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మళ్లీ.. మణిపుర్ ప్రభుత్వం ఇంటర్నెట్పై మళ్లీ నిషేధం విధించింది. పాఠశాలలకు కూడా శుక్రవారం వరకు సెలవులు ప్రకటించింది.
వీధుల్లోకి విద్యార్థులు..
అయితే విద్యార్థుల హత్య దృశ్యాలు మణిపుర్‌లో సంచలనంగా మారాయి. దాంతో ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. రాజధాని నగరం ఇంఫాల్‌లో వందల మంది పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆ దారుణాన్ని నిరసించారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసంవైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పోలీసులు లాఠీ ఛార్జి చేయడం వల్ల 45 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.
'రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి'
Manipur Violence Central Government :మరోవైపు, మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పే మార్గాలను కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. రాష్ట్రంలో వలసదారుల సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతోపాటు కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తునట్లు తెలిపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, హింస్మాతక ఘటనల జరగవని అన్నారు.