Chief Minister of Manipur: మణిపుర్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్.. మరోమారు హెయ్గాంగ్ నియోజకవర్గంలో గెలుపొందారు.ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్చంద్ర సింగ్‌పై 17వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు సింగ్.
జర్నలిస్ట్ టు సీఎం.. వరుసగా ఐదోసారి విజయదుందుభి - బీరెన్ సింగ్ రాజకీయ ప్రస్థానం
Chief Minister of Manipur: ఎన్ బీరెన్ సింగ్.. జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మణిపుర్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తనకు ఎదురులేదని నిరూపించారు. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, జర్నలిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్
బీరెన్ సింగ్ రాజకీయ ప్రస్థానం..
- రాజకీయాల్లోకి రాకముందు ఫుట్‌బాల్ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు బీరెన్ సింగ్. స్పోర్ట్స్ కోటాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లోనూ చేశారు. కానీ, కొద్ది రోజులకే ఆ ఉద్యోగాన్ని వదులుకుని జర్నలిజం వైపు అడుగులు వేశారు. 1992లో నహరోల్జి తౌడాంగ్ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 2001 వరకు దానికి ఎడిటర్‌గా పని చేశారు.
- ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, జర్నలిస్ట్‌గా తనకంటూ ఓ హోదా సంపాదించుకున్న బీరెన్ సింగ్ 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీలో చేరారు. అయితే.. అదే ఏడాది కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ మంత్రివర్గంలో విజిలెన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల, ఆహార నియంత్రణ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ వంటి కీలక పదవులు నిర్వర్తించారు బీరెన్ సింగ్. మాజీ సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగానూ పేరు గడించారు.
- పార్టీతో తలెత్తిన విబేధాల కారణంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2016లో భాజపాలో చేరారు బీరెన్ సింగ్. 2017లో కాషాయ పార్టీ టికెట్‌పై హెయ్గాంగ్ నియోజకవర్గంలో గెలుపొందారు. ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎల్జేపీ, టీఎంసీ భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికై 2017, మార్చి 15న మణిపుర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత మొదలైన క్రమంలో తన రాజకీయ చతురతతో వాటిని సద్దుమణిగేలా చేశారు. మరోమారు భాజపాను అధికారంలోకి తేవటంలో విజయం సాధించారు.
ఇదీ చూడండి:
Last Updated : Mar 10, 2022, 5:53 PM IST