Manipur Opposition Visit : మణిపుర్‌లో జాతుల మధ్యఘర్షణలు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని.. అన్ని పార్టీలు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ సూచించారు. మణిపుర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు విపక్ష కూటమి ఇండియాకు చెందిన 21 మంది ఎంపీలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
చురచంద్‌పుర్‌లో సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్న బాధితులను ఎంపీల బృందం పరామర్శించనుంది. చురచంద్‌పుర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు భద్రతా సమస్యలు ఉండడం వల్ల ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఎంపీలను అక్కడికి తీసుకెళ్లారు. ఎంపీలను రెండు బృందాలుగా విభజించి హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లారు. అధీర్ రంజన్ చౌధురీ నేతృత్వంలోని బృందం ఒక సహాయ శిబిరాన్ని.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని మరో బృందం ఇంకో శిబిరాన్ని సందర్శించనుంది. రెండు రోజులపాటు ఎంపీల పర్యటన కొనసాగనుంది.
సమస్యను అర్థం చేసుకోవడానికే తమ బృందం మణిపుర్ వచ్చిందన్న అధిర్ రంజన్ చౌధురీ.. హింసకు ముగింపు పలికి శాంతి స్థాపన జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తాము రాజకీయాలు చేసేందుకు మణిపుర్ రాలేదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం మణిపుర్ గవర్నర్‌తో ఎంపీల బృందం సమావేశమవుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
గవర్నర్ పరామర్శ
Manipur Violence : మరోవైపు, మణిపుర్‌లో శాంతి స్థాపనకు అన్ని వర్గాలు కలిసి రావాలని ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.. శాంతి పునరుద్ధరణకు సహకరించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు కేంద్రంగా నిలిచిన చురాచంద్‌పుర్‌లోని సహాయ కేంద్రాలను పరిశీలించారు. అక్కడి బాధితుల వేదనను అనుసూయ తెలుసుకున్నారు. ప్రజలందరూ మణిపుర్‌లో శాంతి ఎప్పుడు నెలకొంటుందని అడుగుతున్నారని గవర్నర్ అన్నారు.
మణిపుర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు అన్ని పార్టీలు సహకరించాలని గవర్నర్ సూచించారు. హింసలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని అనుసూయ తెలిపారు. మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.
విచారణ ప్రారంభించిన సీబీఐ
Manipur Incident Video Cbi : మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో కేంద్ర దర్యాపు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేసును సీబీఐకు అప్పగించినట్లు.. సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై మణిపుర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో న్యాయవిచారణను మణిపుర్ ఆవలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం గతంలో అభ్యర్థించింది. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది. మణిపుర్‌లో వెలుగులోకి వచ్చిన ఆ ఘటనను తాము అత్యంత హేయమైనదిగా పరిగణిస్తున్నామని, న్యాయం జరిగేలా చూస్తేనే.. మహిళలపై ఇలాంటి నేరాలు తగ్గుతాయని, అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.