Manipur Indian Army : జాతుల మధ్య వైరంతో సుమారు రెండు నెలలుగా మణిపుర్‌లో ఘర్షణవాతావరణం నెలకొంది. మరోపక్క రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యంలోని 'స్పియర్ కోర్' ఓ వీడియోను విడుదల చేసింది. మానవత్వంతో ఉండటం తమ బలహీనత కాదని.. సుతిమెత్తగా నిరసనకారులను హెచ్చరించింది.
'మణిపుర్‌లోని మహిళా నిరసనకారులు.. ఉద్దేశపూర్వంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు. అలాగే భద్రతాబలగాల కార్యకాలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు భద్రతాబలగాల ప్రయత్నాలకు ఈ ప్రవర్తన ప్రమాదకరంగా మారింది. శాంతి పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం' అని స్పియర్ కోర్ ట్వీట్‌లో తెలిపింది.
ఆర్మీని చుట్టుముట్టిన 1500 మంది మహిళలు
అంతకుముందు కూడా తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో మహిళలు విధ్వంసం సృష్టించారు. రెండురోజుల కిందట ఆర్మీ అదుపులోకి తీసుకొన్న 12 మంది మిలిటెంట్లను విడిపించుకునేందుకు ఏకంగా 1,500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సైన్యం కోరినా.. ఫలితం లేకపోయింది. ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన నెలకొంది. చివరకు వెనక్కి తగ్గిన సైన్యం మిలిటెంట్లను విడిచిపెట్టింది. పౌరుల భద్రత దృష్ట్యా ప్రాణనష్టాన్ని నివారించేందుకు మానవతా దృక్పథంతోనే మిలిటెంట్లను వదిలిపెట్టినట్లు సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో వివరించింది. 2015లో '6 డోగ్రా యూనిట్'పై ఆకస్మిక దాడితో సహా అనేక ఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని సైన్యం తెలిపింది. దీంతోపాటు పెద్దఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుని తరలించింది.
Manipur All Party Meeting : ఎస్టీ హోదా కోసం మైటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్ లోయ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఇది ఘర్షణకు దారితీయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇటీవల మణిపుర్ అల్లర్లపై కేంద్రహోం మంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మణిపుర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్ షా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్‌ను తప్పించియ.. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. మణిపుర్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని.. హింసాత్మక ఘటనలను కేంద్ర హోం మంత్రినియంత్రించలేకపోయారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.