Manipur election 2022: మణిపుర్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదేళ్ల కిందట అనూహ్య పరిస్థితుల్లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుండగా.. అధికారంలో కొనసాగేందుకు కమలదళం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
Manipur election BJP
పొత్తు లేకుండానే భాజపా..
ఐదేళ్ల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో తమకు అండగా నిలిచిన ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీలతో పొత్తు లేకుండానే ప్రస్తుతం కమలదళం ఎన్నికల బరిలో దిగింది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే రాష్ట్రంలోనూ పగ్గాలు అప్పజెప్పేందుకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొగ్గుచూపుతుంటారు. ఈ విషయం భాజపాకు కలిసొచ్చేదే.
మోదీ చరిష్మా..
ప్రధాని నరేంద్ర మోదీ 'డబుల్ ఇంజిన్ అభివృద్ధి' నినాదం భాజపాకు అనుకూలించే అవకాశం ఉంది. మోదీ చరిష్మాపైనే రాష్ట్ర భాజపా ఆశలు పెట్టుకుంది. ప్రధాని సైతం మణిపుర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మోదీ మణిపుర్ కండువా కప్పుకొని రాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్త గుర్తింపు ఇచ్చారు. ఈ విషయాన్ని భాజపా ప్రచారం చేసుకుంటోంది.
భాజపాలో అంతర్గత కలహాలు..
అయితే, టికెట్ల పంపిణీ వ్యవహారం భాజపాలో చర్చనీయాంశంగా మారింది. వల్ల అంతర్గత ఘర్షణలు, విధేయులు, బంధువులకే సీఎం బీరేన్ సింగ్ టికెట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు భాజపాకు ప్రతికూలంగా మారాయి. కీలక నేతలు పార్టీ మారడం కూడా కాషాయ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది.
'హస్త'వాసి ఎలా ఉంటుందో?
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దశాబ్దాలుగా మంచి పట్టుంది. 2002 నుంచి 2017 వరకు ఏకధాటిగా ఇక్కడ పార్టీ పాలనే కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 28 సీట్లు గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. 21 స్థానాలే గెల్చుకున్న కమలదళం.. ఫలితాల ప్రకటన తర్వాత చకచకా పావులు కదిపి ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది.
నాయకత్వ సమస్య..
కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందాస్ కొంథౌజమ్ సహా కీలక నేతలు పార్టీ మారడం కాంగ్రెస్‌ను మరింత దెబ్బతీసింది. శాసనసభ్యులు భాజపాలోకి చేరడం, సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. అధిష్ఠానంలో నాయకత్వ సమస్యలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉన్నాయి.
ఎన్‌పీపీ సొంతంగానే...
NPP Manipur election 2022:
భాజపా, కాంగ్రెస్‌ల తర్వాత ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) సొంతంగా అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ప్రస్తుతం మణిపుర్‌లో 42 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించింది.
నాగాల మద్దతుతో...
రాష్ట్రంలోని నాగా వర్గాలపై మంచి పట్టున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్).. తమకు ప్రాబల్యమున్న ప్రాంతాల్లోనే ఎన్నికల బరిలో నిలిచింది. మొత్తం 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆ 10సీట్లలో భాజపా ఉద్దేశపూర్వకంగా బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించిందని, 2017లో ప్రభుత్వ ఏర్పాటులో తమకు చేయూతనందించిన ఎన్‌పీఎఫ్‌కు తద్వారా సహకరిస్తోందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మరోవైపు- కొత్తగా ఏర్పాటైన కుకీ పీపుల్స్ కూటమి (కేపీఏ) రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
గత ఎన్నికల్లో ఇలా..
మణిపుర్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు- 60. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ- 31. గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. 21 స్థానాలే గెల్చుకున్న కమలదళం.. ఫలితాల ప్రకటన తర్వాత చకచకా పావులు కదిపింది. నలుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎన్‌పీపీ శాసనసభ్యులతోపాటు తృణమూల్ కాంగ్రెస్(1), లోక్ జనశక్తి పార్టీ(1), స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
పాదరక్షల వివాదం
దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లిన మణిపుర్ ప్రతినిధి బృందంలోని సభ్యుల పాదరక్షలను ఇంటి బయటే బలవంతంగా విప్పించారన్న ఆరోపణలు రాష్ట్రంలో ఇటీవల దుమారం లేపాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఇతర వర్గాల్లోనూ ఈ వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. మణిపుర్ గిరిజన ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వినిపించింది.
సాయుధ బలగాల చట్టానికి దూరం..!
వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి సంబంధించిన వివాదం జోలికి వెళ్లేందుకు ఏ పార్టీ సాహసించడం లేదు. తాము అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆ చట్టం అమలు అవసరం లేదని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతున్నా, నిజానికి రాష్ట్రంలో ఆ చట్టం అమలులోకి వచ్చింది ఆ పార్టీ హయాంలోనే. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేపట్టిన ఇరోం షర్మిలా చాను 2016లో దీక్ష విరమించి, 2017 ఎన్నికల్లో పోటీ చేయగా, కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దీంతో ప్రధాన పార్టీలు దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం లేదు.
ఎన్నికల తేదీలు మార్పు..
మణిపుర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీలు మారుస్తూ.. రెండు రోజుల క్రితమే ఎన్నికల సంఘం ప్రకటన వెలువరించింది. పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరుగుతుందని వెల్లడించింది. తొలుత ప్రకటించిన జాబితా ప్రకారం ఫిబ్రవరి 27న తొలి దశ, మార్చి 3న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తేదీల మార్పు ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? దీని వల్ల ఎవరికి లాభం అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలను ప్రభావితం చేయగల ఇతర అంశాలు
రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య సైతం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్గత భద్రత సైతం ఎలక్షన్‌ను ప్రభావితం చేయనుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి:'దేశంలోని విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్‌కోడ్ నిబంధన!'