manipur assembly election: మణిపుర్ అసెంబ్లీకి చివరిదైన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 67.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఓ ఇబోబీ.. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఒకట్రెండు సీట్లు తగ్గినా.. ఇతర పార్టీలతో జట్టుకట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
BJP worker killed Manipur
శనివారం ఉదయం భాజపా కార్యకర్తపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో భాజపాకు చెందిన అముబా సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని భాజపా వర్గాలు ఆరోపించాయి. పోలింగ్‌కు ముందు ప్రచారం నిర్వహించవద్దని కాంగ్రెస్ నేత ఇంటికి.. అముబా సహా భాజపా కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అముబాపై కాల్పులు జరిగాయని సమాచారం. మరో ఘటనలో భాజపా బహిష్కృత నేత ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ కథనం పూర్తి వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
రెండో విడత పోలింగ్‌లో మొత్తం 92 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,247 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ నియోజకవర్గాల్లో 8.38 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.
ఫిబ్రవరి 28న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ పూర్తైంది. పలు అవాంఛనీయ ఘటనలు, హింస మధ్య ఆ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.
ఇదీ చదవండి:కాశీ విశ్వనాథుడి సన్నిధిలో 'డమరుకం' మోగించిన మోదీ