అది 2021 మార్చి 13... కేరళ మలప్పురం జిల్లా వాజిక్కడవులోని మైదానంలో చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. అంతలో ఓ రెండున్నర నెలల వయసు ఉన్న ఓ గున్న ఏనుగు వారి మధ్యకు వచ్చింది. దాంతో పిల్లలంతా ఇళ్లకు పరుగందుకున్నారు. ఈ ఏనుగు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ గున్న ఏనుగు తన మంద నుంచి విడిపోయి.. ఇలా జనావాసాల్లోకి వచ్చిందని తెలుసుకున్న వారు.. తిరిగి దాని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నించారు.
తల్లి రాలేదు..
చుట్టుపక్కల ఏనుగులు సంచరించే వివిధ ప్రాంతాల్లోకి ఆ గున్న ఏనుగును అటవీ సిబ్బంది తీసుకువెళ్లారు. కానీ, దాని వద్దకు తల్లి ఏనుగు రాలేదు. దాంతో.. కొన్ని నగరంలోని ఏనుగు శిక్షణా కేంద్రానికి ఈ పిల్ల ఏనుగును తరలించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ గున్న ఏనుగుకు వాజిక్కడవు ప్రజలే 'మణికందన్' అని పేరు పెట్టారు. మావటీలు.. మణికందన్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతున్నారు. ఆకలేసినప్పుడు పాల కోసం తన చిన్ని తొండాన్ని చాచి అడుగుతోందని వారు చెబుతున్నారు.