త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ సాహా. అగర్తలలోని రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా నిలిచారు సాహా.
రాజ్యసభ సభ్యుడైన మాణిక్ సాహా.. ప్రస్తుతం భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిప్లవ్ కుమార్ దేవ్ శనివారం రాజీనామా చేశారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వృత్తి రీత్యా దంత వైద్యుడైన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్‌ను వదిలి భాజపాలో చేరారు. 2020 నుంచి భాజపా త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
మాణిక్ సాహా పశ్చిమ త్రిపురలో 1953, జనవరి 8లో జన్మించారు. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పట్నాలోని ప్రభుత్వ వైద్య కశాశాలలో బీడీఎస్, లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాలలో ఎండీఎస్ పూర్తి చేశారు. పలు పత్రికలు, జర్నల్స్‌కు వ్యాసాలు కూడా రాస్తుంటారు. క్రీడలంటే ఎంతో మక్కువ. స్వయంగా ఆయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మాణిక్ సాహా పలు పతకాలు, సర్టిఫికెట్లు సాధించారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, త్రిపుర స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఈజిప్టు, హాంకాంగ్, థాయిలాండ్, దుబాయి వంటి దేశాల్లో పర్యటించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
భాజపా ఉత్తరాఖండ్ వ్యూహం:పదే పదే ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని గతంలో భాజపా ఆరోపణలు గుప్పించేది. ఆసక్తికరమేంటంటే.. ఇప్పుడు అదే వైఖరిని కాషాయ పార్టీ అనుసరిస్తోంది. గత శనివారం త్రిపురలో అనూహ్యంగా సీఎం బిప్లవ్ కుమార్ దేవ్‌తో రాజీనామా చేయించి, ఆ స్థానంలో మాణిక్ సాహాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది. దీని వెనుక ఉత్తరాఖండ్ వ్యూహం దాగుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఉత్తరాఖండ్‌లో సీఎంను మారుస్తూ తీసుకున్న నిర్ణయం.. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాకు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 2023లో ఎన్నికలు జరుపుకోనున్న త్రిపురలోనూ ఇదే వ్యూహాన్ని కాషాయపార్టీ పునరావృతం చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.