Malda Mango Price : దేశంలోనే వివిధ రకాల మామిడి ఉత్పత్తులకు బంగాల్లోని మాల్దా జిల్లా నిలయం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మామిడి కాయలను, పండ్లను సాగు చేస్తుంటారు ఇక్కడి రైతులు. మాల్దా జిల్లాలో పండించిన మామిడికి దేశ విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంటుంది. చాలా మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ధరలు పూర్తిగా తగ్గిపోయాయని మామిడి ఉత్పత్తిదారులు, విక్రయదారులు చెబుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడికి కూడా ఆదాయం రావటం లేదని వారు వాపోతున్నారు.
మార్కెట్లో మామిడికి ఆశించినంత డిమాండ్ లేదని రైతులు చెబుతున్నారు. బిహార్, అసోంకు తప్ప మరెక్కడికీ మామిడి ఎగుమతి కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణ్ భోగ్ రకం మామిడి పండ్లు కేవలం కిలో 5 రూపాయలకే అమ్ముడుపోతున్నాయని.. విక్రయదారుడు దుల్లి చౌదరి చెప్పాడు. హిమసాగర్, లాంగ్రా వంటి రకం మామిడి కాయలు రూ.10-15కే అమ్ముడుపోతున్నాయని వెల్లడించాడు. ఈ సారి ధర చాలా తక్కువగా ఉందని చౌదరి తెలిపాడు. మామిడి పండ్లను రూపాయి నుంచి రూ.3కే తోటల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
"లక్ష్మణభోగ్, రాఖల్‌భోగ్ రూ.5-8కి.. క్షీరపతి (హిమసాగర్) కిలో రూ.10-20కి విక్రయిస్తున్నాం. లాంగ్రా మామిడి రకం పండ్లు కూడా ఇదే తరహాలో అమ్ముడుపోతున్నాయి. చాలా రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికి ధరలు మాత్రం విపరీతంగా తగ్గిపోయాయి" అని రిటైల్ మామిడి విక్రయదారుడు షెఫాలీ మండల్ చెబుతున్నాడు.