పోలీసులు అనగానే అందరికి గుర్తొచ్చేది ఖాకీ రంగు యూనిఫాం. అలాగే రవాణా శాఖ ఉద్యోగులు, వివిధ పరిశ్రమల కార్మికులు కూడా ఖాకీ రంగు దుస్తుల్నే యూనిఫాంగా ఉపయోగిస్తారు. ఖాకీ రంగు దుస్తుల్ని మొదట ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరో, తొలుత ఎక్కడ తయ్యారు చేశారో ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఖాకీ రంగు దుస్తులను భారత్లోనే కాకుండా ప్రపంచంలోని పలు రంగాల ఉద్యోగులు యూనిఫాంగా ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వ్యాఖ్యానించడం వల్ల.. ఖాకీ యూనిఫాం చర్చనీయాంశమైంది. ఖాకీ దుస్తుల్ని.. మొట్టమొదటసారిగా కర్ణాటక మంగళూరులోని బల్మఠలోని ఓ ఖాదీ కర్మాగారంలో తయారుచేశారు. ఖాకీ రంగు వస్త్రాలపై పీహెచ్డీ చేసిన పుత్తూరులోని వివేకానంద కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ పీటర్ విల్సర్ ప్రభాకర్ ఈ విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం పెట్టాలనుకుంటే ఖాకీ రంగునే ఉపయోగించాలని కోరారు.
"ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖాకీ యూనిఫాంను మంగళూరులో తయారు చేశారు. బాషెల్ అనే మిషనరీ సంస్థ.. 1844వ సంవత్సరంలో మంగళూరులోని బల్మఠలో ఖాదీ కర్మాగారాన్ని స్థాపించింది. 1852లో జర్మనీకి చెందిన జాన్ ఎల్లెర్ తన పరిశోధనల ద్వారా ఖాకీ రంగు వస్త్రాన్ని తయారుచేశారు. జీడిపప్పు తొక్క, బెరడుతో తయారు చేసిన రసాన్ని ఖాదీపై చల్లడం ద్వారా ఖాకీ రంగు వస్త్రాన్ని రూపొందించారు."