Manappuram bank robbery: రాజస్థాన్ ఉదయ్పుర్లో ఐదుగురు దుండగులు కలిసి 24 కిలోల బంగారం, రూ.10లక్షల నగదు దోచుకెళ్లారు. సోమవారం ఉదయం ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లోకి ఆయుధాలతో చొరబడి, నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీ చేశారు. అక్కడి సిబ్బందిని పిస్టళ్లతో బెదిరిస్తూ.. మెరుపు వేగంతో పరారయ్యారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి వెళ్లారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసుల్ని మోహరించి, విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..సోమవారం ఉదయం బ్యాంక్ తెరిచిన వెంటనే ఐదుగురు దుండగుల్లో ఇద్దరు లోపలకు ప్రవేశించారు. మిగతా వారు బ్యాంక్ బయట కాపలాగా ఉన్నారు. దుండగులు అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించారు. బ్యాంక్ సిబ్బందిని పిస్టళ్లతో బెదిరించి.. వారందరినీ నేలపై కూర్చోబెట్టారు. బ్యాంక్ సిబ్బందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎదురుతిరిగిన సిబ్బందిలోని ఓ వ్యక్తిని కాలితో తన్నారు. మరికొందరి ముఖంపై దాడి చేశారు. అంతలో మరో వ్యక్తి దుండగులకు బ్యాగ్‌ను అందించాడు. బ్యాంక్ ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉండగానే దోపిడీ పూర్తిచేసి పారిపోయారు దుండగులు.