ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగివ్వమని అడిగినందుకు ఓ వృద్ధునిపై అతడి పక్కింటి వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన కుమారుడితో కలిసి వృద్ధుడి ఇంట్లోకి దూరిన నిండితుడు వీరంగం సృష్టించాడు. రాద్దంతం చేసి ఆ వృద్ధుడ్ని చితకబాదాడు. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెళ్తున్న ఆ వృద్ధుడిని ఆపి.. నిండితుడి కొడుకు ఆయనపై మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆవేదన చెందిన బాధితుడు.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి నిండితులపై ఫిర్యాదు చేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగ్రాలోని నాగ్లా కరణ్ సింగ్ నైనానా బ్రాహ్మణ ప్రాంతంలో 76 ఏళ్ల ఛత్తర్ సింగ్ కుష్వాహా అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. ఆయన తన పొరుగింటి వ్యక్తి అయిన మూల్‌చంద్‌కు పది నెలల క్రితం రూ.14,000 సొమ్మును అప్పుగా ఇచ్చాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉదయం.. ఛత్తర్ సింగ్ తనకు రావాల్సిన బాకీని వసూలు చేసేందుకు మూల్‌చంద్ ఇంటికి వెళ్లాడు. కానీ మూల్‌చంద్.. ఆ వృద్ధుడికి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతే కాకుండా ఆయనతో వాగ్వాదానికి దిగి ఆయన్ను క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన ఛత్తర్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో కోపంతో మూల్‌చంద్ తన కుమారుడు మురారిని వెంటబెట్టుకుని వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు.