Man tried to kill In Laws in sangareddy : కామారెడ్డి జిల్లా పిట్లంలో ఉండే రమేష్ అనే వ్యక్తి.. ఈ నెల 12న రాత్రి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేటలోని తన భార్య పుట్టింటికి వచ్చాడు. ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉండటంతో... బయటి నుంచి పిలవగా ఇంట్లో వాళ్లు పలకలేదు. దీనికితోడు రెండేళ్లుగా భార్యను సంసారానికి పంపట్లేదని... అత్తమామల మీద కోపం పెంచుకున్న రమేష్.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఉన్నపళంగా ఓ పథకం రచించాడు.
అత్త మామల ఇంటికి వచ్చిన రమేష్.. ప్రధాన ద్వారం పక్కన ఉన్న విద్యుత్ మీటర్ నుంచి.. ఓ తీగను తలుపులకు బిగించాడు. ఓ బకెట్లో నీళ్లు పెట్టి.. ఇనుప రాడ్డును నీళ్లలో పెట్టి తలుపులకు అనుసంధానించాడు. తెల్లవారుజామున తన అత్తామామలు తలుపులు తీసే సమయంలో.. విద్యుదాఘాతానికి గురై చనిపోతారని ఉహించుకున్నాడు. కానీ అత్తమామలు తలుపు తీస్తారనుకుంటే.. తన భార్య కూతుర్లు తీసి కరెంట్ షాక్‌కు గురయ్యారు. విలవిల్లాడుతూ కేకలు వేయడంతో.. గమనించిన ఇరుగుపోరుగు వెంటనే అప్రమత్తమై.. కరెంటు తీగలను తొలగించారు.
రమేష్ మామ... దన్యాల రాములు అదే రోజు తన పొలం వద్దకు వెళ్లి చూడగా.. తన పోలంలోని రెండు బోర్లు తగలబడిపోయి కనిపించాయి. బోర్లపై వరిగడ్డి వేసి వాటిని కాల్చి వేశారు. ఇంటికి విద్యుత్ షాక్‌తో తమపై హత్యాయత్నం చేయడం, బోర్లు కాల్చివేసిన ఘటనలపై రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనలను పరిశీలించిన పోలీసులు.. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.