ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడికి, కొంగకు మధ్య ఉన్న స్నేహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనను కాపాడిన వ్యక్తిని విడిచిపెట్టలేక.. అతడితోనే ఉండిపోయింది ఓ కొంగ. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠి జిల్లా మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్‌కు ఏడాది క్రితం ఈ కొంగ పరిచయమైంది. వరికోత యంత్రంపై పనిచేసే అతడికి.. ఓ పొలంలో కాలు విరిగి కదల్లేని స్థితిలో కొంగ కనిపించింది. నొప్పితో విలవిల్లాడుతున్న కొంగను ఇంటికి తీసుకొచ్చి దానికి చికిత్స చేశాడు. కొంగ నిలబడేందుకు వీలుగా.. దాని కాలికి వెదురు పుల్లలను కట్టాడు. ఫిబ్రవరిలో కొంగను తీసుకురాగా.. ఏప్రిల్ నాటికి అది పూర్తిగా కోలుకుంది. ఇక అది ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించినా.. కొంగ మాత్రం అతడిని వదలలేదు.
'నిను విడిచి నేనుండలేను'.. యువకుడితో కొంగ స్నేహం.. వెంటే ఎగురుతూ వెళ్తున్న 'బచ్చా' - stork follows man going on bike video
సాధారణంగా పక్షులు, జంతువులతో స్నేహం చేసేవారిని చూసి ఉంటాం. మరికొందరు ఇంకాస్త సాహసం చేసి క్రూర మృగాలతోనూ చెలిమి చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం ఓ కొంగతో సావాసం చేస్తున్నాడు. ఇంతకీ.. ఆ కొంగకు, యువకునికి స్నేహం ఎలా కుదిరింది? అసలు అతడిని విడిచి ఆ కొంగ ఉండలేకపోవడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
5 అడుగుల ఎత్తు.. రెక్కలు విప్పినపుడు 8 అడుగుల వెడల్పు ఉండే ఈ కొంగకు 'బచ్చా' అని ఆరిఫ్ పేరుపెట్టాడు. ఆ కొంగ ఆరిఫ్‌తో కలిసి ఆహారం తినేది. ఆరిఫ్ బైక్ మీద వెళ్తుంటే.. అతని వెంటే బచ్చా ఎగిరివెళ్లేది. వీరిద్దరి మైత్రిని చూసి స్థానికులతోపాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆరిఫ్ అంటే అమితమైన ప్రేమ కురిపిస్తున్న ఈ కొంగ.. మిగతా వారిని మాత్రం దగ్గరికి రానీయడం లేదు. ఆరిఫ్ ఇంట్లో లేనపుడు ఆయన భార్యగానీ, కుమారుడు గానీ ఆహారం అందించేందుకు వెళ్తే వారిపై దాడి చేస్తోంది. దీంతో వారు కొంగ దగ్గరికి వెళ్లడమే మానేశారు. చలికాలంలో ఆ కొంగ దగ్గరికి చాలా కొంగలు వచ్చాయి. దీంతో ఆ కొంగలతో కలిసి బచ్చా కూడా వెళ్లిపోతుందని అరిఫ్ భావించాడు. కానీ కొన్నిరోజుల తర్వాత మిగతా కొంగలన్నీ అక్కడి నుంచి వెళ్లినప్పటికీ.. బచ్చా మాత్రం ఆరిఫ్ వద్దే ఉండిపోయింది.
ఎప్పుడైనా దూరం వెళ్లాల్సి వస్తే మాత్రం కొంగ కంట పడకుండా చూసుకుంటాడు ఆరిఫ్. వేరే ఎవరితోనైనా బైక్‌ను ఇంటి బయటకు తెప్పించుకొని వెళ్తాడు. ఆరిఫ్ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కొంగ అతడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆరిఫ్ ఇంటికి తిరిగి రాగానే.. అతడిని చూసి గంతులు వేస్తుంది. తన రెక్కలను ఆడిస్తూ అతడికి స్వాగతం పలుకుతుంది. ఒకవేళ కొంగ తనంతట తాను ఎప్పుడైనా బయటకు వెళ్లినా.. చివరకు ఆరిఫ్ ఇంటికే వచ్చేస్తుంది.