కరోనా వైరస్‌తో పోరాడుతూ అంతిమగడియల్లో ఉన్న తల్లితో ఓ కుమారుడు జరిపిన సంభాషణ హృదయాలను కలచివేస్తోంది. కడసారిగా తల్లితో మాట్లాడిన ఆ కుమారుడు.. ఆమె కోసం 1973 నాటి 'తేరే ముజ్ సే హై పహలే క నాతా కొయీ' అనే ప్రముఖ హిందీ పాట పాడాడు. దిప్సికా ఘోష్ అనే డాక్టర్ షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ఈ రోజు నా షిఫ్ట్ పూర్తయ్యే సమయంలో.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న రోగులకు వారి బంధువులతో వీడియో కాల్ మాట్లాడించాను. మేము సాధారణంగా ఈ పని చేస్తుంటాము. ఓ రోగి కుమారుడు తన తల్లితో మాట్లాడుతూ.. 'తేరే ముజ్ సే హై పహలే కా నాతా కొయీ' అనే పాట పాడాడు. తన తల్లికి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అతడు ప్రాధేయపడ్డాడు. దు:ఖిస్తూ అతడు పాడుతున్న పాటతో.. ఆ ఫోన్‌ను పట్టుకుని తల్లి వైపు, కుమారుని వైపు చూస్తూ ఉండిపోయాను. నాతో పాటు సిబ్బంది అంతా అలాగే నిలబడిపోయారు. మధ్యలో తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. కానీ పాట పూర్తి చేశాడు. ఆమె పరిస్థితి ఎలా ఉందని నన్ను అడిగాడు. థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు."
-డాక్టర్ దిప్సికా ఘోష్
"ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇంత టెక్నాలజీ ఉన్నా.. ప్రాణాల్ని కాపాడుకోలేకపోతున్నాము. ఈ బాధను తగ్గించే మాటలే లేవు. హృదయాలు భారంగా మారిపోయాయి. మళ్లీ మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నాను."