Man Shot Dead In Union Minister Home :కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కేంద్ర మంత్రి తనయుడి తుపాకితో యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫరీదీపుర్లోని మాధవపుర్ వార్డుకు చెందిన వినయ్ శ్రీవాస్తవ అనే యువకుడు, మంత్రి కౌశల్ కిశోర్ కుమారుడు వికాస్ స్నేహితులు. అయితే వీరిద్దరు గురువారం సాయంత్రం తమ స్నేహితులు అజయ్, రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబాతో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలెత్తిన గొడవలో కాల్పులు జరిగాయి. దీంతో శ్రీవాస్తవ మృతిచెందాడు. ఈ హత్యకు గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో వికాస్ పేరుతో ఉన్న లైసెన్స్డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. హత్య ఎవరు చేశారు? హత్యకు దారితీసిన కారణాలేవి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నా కుమారుడు దిల్లీలో ఉన్నాడు : మంత్రి
ఈ హత్య గురించి తెలుసుకున్న మంత్రి కౌశల్ కిశోర్.. కమిషనర్‌కు సమాచారం అందించారు. పోలీసు విచారణలో ఈ హత్య గురించి నిజానిజాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో తాను లేనని చెప్పారు. అయితే, తన కుమారుడు కూడా ఘటనాస్థలిలో లేడని.. అనారోగ్యంగా ఉన్న కారణంగా దిల్లీలో ఉన్నాడని తెలిపారు.