కర్ణాటక యాదగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. విడాకులు ఇవ్వట్లేదని.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
నారాయణపురలో నివసించే నిందితుడు శరణప్ప భార్య హులిగమ్మ.. కేఎస్ఆర్టీసీ లింగసగూరు డిపోలో మెకానిక్‌గా పనిచేస్తోంది. విడాకుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 14 నెలల క్రితమే భర్తను వదిలి.. లింగసగూరులో వచ్చి ఉంటుంది హులిగమ్మ. అప్పటినుంచి విడాకులు ఇవ్వాలని ఆమెను బెదిరిస్తూనే ఉన్నాడు శరణప్ప. ఆమె ఒప్పుకోకపోవడంతో పరిష్కారం కోసం.. వారి బంధువులను తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అనంతరం.. విడాకులు ఇప్పించాల్సిందిగా వారిని కోరాడు. కానీ.. అతని భార్య కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శరణప్ప వారందరినీ ఇంట్లో పెట్టి తాళం వేసి.. కిటికీలోనుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
గమనించిన చుట్టుపక్కల ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. మంటల్లో కాలిపోతున్న.. సిద్రామప్పు మురాళ, ముత్తప్ప మురాళ, శరణప్ప సరూర్, నాగప్పను లింగసగూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ నాగప్ప, శరణప్ప సరూర్ ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నారాయణపుర స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శరణప్పను అరెస్టు చేశారు.