Man Sentenced to 109 Years Imprisonment :12 ఏళ్ల బాలికను దత్తత తీసుకుని లైంగికంగా వేధించిన కేసులో ఓ వ్యక్తికి 109 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కేరళలోని ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. దీంతో పాటుగా రూ.6,25,000 జరిమానా వేసింది పథనంతిట్ట జిల్లాలోని అడూర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో 3 ఏళ్ల 2 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పును ఇచ్చింది. ఈ జరిమానా మొత్తాన్ని బాలిక అవసరాల కోసం వినియోగించాలని కోర్టు ఆదేశించింది. పథనంతిట్ట జిల్లాలోని పండాలం కూరంబళ ప్రాంతానికి చెందిన థామస్ శామ్యూల్‌కు ఈ శిక్ష విధించింది. అడూర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో ఇదే ఎక్కువ కాలం శిక్ష.
ఇదీ జరిగింది
తమిళనాడులో తల్లిదండ్రులు వదిలేసిన అన్నాచెల్లెళ్లు రోడ్డుపై తిరగడాన్ని గమనించిన చిన్నారుల సంరక్షణ కమిటీ.. వారి బాధ్యతలు తీసుకుంది. బాలుడిని తిరువల్లాకు చెందిన ఓ కుటుంబానికి దత్తత ఇచ్చింది. 12 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్నారు శామ్యూల్ దంపతులు. ఈక్రమంలోనే బాలికను ఇంటికి తీసుకువచ్చిన శామ్యూల్.. ఏడాదిగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మలయాళం సరిగ్గా తెలియని బాలిక.. నిందితుడి గురించి చెప్పడానికి సాధ్యం కాలేదు. దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానని శామ్యూల్ బెదిరించాడు. బాలిక అతడికి భయపడి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.