Man Saved by Fishermen After 43 Hours Of Drowning :చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడు.. అదుపుతప్పి అరేబియా సముద్రంలో పడిపోయాడు. సుమారు 43 గంటల పాటు సముద్రంలో ఈత కొడుతూనే ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇక అతడిలో ఆశలు సన్నగిల్లుతున్న దశలో చేపలు పట్టడానికి వచ్చిన జాలర్లు గుర్తించడం వల్ల బతికి బయటపడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఇదీ జరిగింది
తమిళనాడుకు చెందిన 8 మంది మత్స్యకారులు చేపలు పట్టేందుకు అరేబియా సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇందులో సభ్యుడైన మురుగన్ (25).. నవంబర్ 8 రాత్రి మూత్రం పోసేందుకు పడవ చివరకు వెళ్లి సముద్రంలో పడిపోయాడు. దీనిని గమనించని తోటి మత్స్యకారులు.. అలానే ముందుకు వెళ్లిపోయారు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి.. గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభించలేదు. దీంతో మురుగన్ మరణించి ఉంటాడని ఆశలు వదిలేసుకున్నారు.
అయితే, నవంబర్ 10న గంగోళి సాగర్‌కు చెందిన మత్స్యకారులు చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిని గమనించిన మురుగన్.. రక్షించాలంటూ గట్టిగా అరుస్తూ చేతులను పైకి ఎత్తాడు. అతడిని చూసిన మత్స్యకారులు.. సముద్రంలోకి దూకి కాపాడారు. రెండు రోజులుగా ఈత కొడుతూ ప్రాణాలను రక్షించుకున్న మురుగన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. అతడికి ప్రాథమిక చికిత్స అందించిన మత్స్యకారులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పంపించారు. మురుగన్‌ను రక్షించినందుకు తమిళనాడు మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు.